Saturday, February 9, 2013

సత్యం...శివం...సుందరం! (పునరావర్తనం)




(రాయాలనే తపన, ఏమి రాయడమా అనే మీమాంశ, రాయడానికి బద్దకమూ, రాసిపడేస్తాననే ప్రగల్భాలు, రాయడానికి టైము లేదనే కుంటి సాకులూ... వీటన్నిటిని విదిలించుకుని రాయడానికి, మొదలు పెట్టినవి పూర్తిచెయ్యడానికి న్నన్ను నేను మోటివేట్ చేసుకునే ఉద్దేశంతో , ఎప్పుడో దాదాపు నాలుగేళ్ళ క్రితం "Bruce Almighty" అన్న సినిమా ప్రభావంతో నేను ఇక్కడ రాసిన ఈ పోస్టుని రీసైకిల్ చేస్తున్నాను... నచ్చినా, నచ్చక పోయినా నాలుగు అక్షింతలు వేసేయండి మరి...)

11 జూలై 2006, సాయంత్రం 6:15

ప్రతీ రోజులాగే బాంద్రా స్టేషన్ వైపు వడివడిగా అడుగులేస్తున్నాను. వీలైనంతవరకూ, నేను 18:20 బోరివలి లోకల్ ట్రైన్ మిస్ అవను. ముంబైలోని చాలమందికి అలవాటు - ప్రతీ రోజూ, ఆఫీసుకెళ్ళడానికి, తిరిగి ఇంటికెళ్ళడానికి ఒక నిర్ణీతమైన లోకల్ ట్రైను ఉపయోగిస్తుంటారు. ఈ రొటీన్లో సాధారణంగా మార్పుండదు. ముంబైకొచ్చిన రెండేళ్ళలొ, నేనూ ఇలా అలవాటు పడిపోయాను. అందుకే, సాయంత్రం ఇంటికెళ్ళడానికి వీలైనంతవరకూ 18:20 బోరివలి ఫాస్ట్ లోకల్ మిస్ అవడానికి ఇష్టపడను.

అసలు ముంబై నగరవాసులకూ, గడియారంలోని ముళ్ళకూ పెద్ద తేడా కనిపించందు నాకు. ప్రపంచంతో సంబంధం లేకుండా పరుగెత్తడాన్ని ముంబై నగరం ప్రతి ఒక్కరికీ అలవాటు చేస్తుంది. అది అనుభవిస్తే కాని అర్ధం కాదు. నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకొచ్చి, రెండో నంబర్ ప్లాట్ ఫాం వైపు దాదాపు పరుగులాంటి నడకతో వెళుతున్నాను. రైలు ప్లాట్ ఫాం మీద సిద్దంగా ఉంది. లోకల్ రైళ్ళు సాధారణంగా నలభై సెకన్లు పాటు ఆగుతాయి. నేను పరుగు వేగం పెంచాను. మెట్లు దిగగానే రెండవది నేనెక్కవలసిన ఫస్ట్ క్లాసు భోగీ. నేను చివరి మెట్టు మీద ఉండగానే ట్రైన్ స్టార్ట్ అయ్యింది. అది వేగం పుంజుకుంటుండగా, దాన్ని మిస్ అవ్వడం ఇష్టం లేక, అందుబాట్లో ఉన్న సెకండ్ క్లాస్ భోగీలోకి ఎక్కేసాను.

ఎప్పట్లానే భొగీ విపరీతమైన రద్దీగా ఉంది. అతికష్టం మీద, జనాన్ని తోసుకుంటూ లోపలికి రెండడుగులు వేసాను. చాలా విసుగ్గా ఉంది. ఫస్ట్ క్లాసులోనైతే ఇంత రద్దీ ఉండదు. నిదానంగా తరువాత ట్రైన్ క్యాచ్ చేసుండల్సింది... ఇలా ఆలోచిస్తుండగానే ఒక్క సారిగా పెద్ద శబ్ధం. ట్రైను దదాపు తలక్రిందలయ్యేంతగా ఊగి, ఒక్క కుదుపుతో ఆగిపొయ్యింది. ఎమౌతోందొ అర్ధం కాలేదు.

ఇంతలో ఎవరో గట్టిగా అరిచారు "బాంబ్ హై! భాగో! అని. ఒక్క క్షణం నిచ్చేష్టుణ్నై, మెల్లగా ఆ తోపులాటలో పడి, పెద్దగా నా ప్రయత్నమేమీ లేకుండానే బయట పడ్డాను. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అంతా గందరగోళంగా ఉంది.

నెమ్మదిగా అర్ధమయ్యిందేంటంటే, ఫస్ట్ క్లాస్ భోగీలో బాంబు పేలింది..చాలా మంది చనిపోయారు/ గాయాపడ్డారు. ఇంకా ఎన్ని బాంబులున్నాయో తెలియదు... అందరూ దూరంగా పరుగెడుతున్నారు. మెల్లగా వాస్తవం నాకు పూర్తిగా అవగతమైంది.. నేను వెంట్రుకవాసిలో మిస్ అయిన ఫస్ట్ క్లాస్ భోగీలో బాంబు పేలింది. మరణానికీ, నాకూ మధ్య కొద్ది సెకన్ల తేడా. 

అందరూ మెల్లగా తేరుకుని ఫస్ట్ క్లాస్ భోగీ వైపు అడుగులేస్తున్నారు. కొంతమంది ధైర్యస్తులు లోపలికి వెళ్ళి గాయపడిన వారికి సహాయం చేస్తున్నారు. అరుపులూ కేకలతో ఆ ప్రదేశమంతా గందరగోళంగా మారింది.  అదురుతున్న గుండెలతో, నిస్సత్తువగా నెమ్మదిగా అటువైపెళ్ళాను. ఓహ్ ...హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరాలు, భాదితుల ఆర్తనాదాలు, ఏడుపులూ, పేడబొబ్బలూ.. కలలో కూడా ఊహించలేని దృశ్యం. ఎవరు బ్రతికున్నారో, ఎవరు చనిపోయారో తెలియడం లేదు. చేయి తెగి భాదతో అరుస్తూన్న సర్దార్జీ, విగత జీవుడై పడి ఉన్న పార్శీ ముసలివాడు, రక్తపు మడుగులోని స్టాక్ బ్రోకరూ, స్టేట్ బాంక్ లో పని చేసే పలనివేల్... చాల వరకు తెలిసిన మొహాలే. గత రెండేళ్ళగా కలిసి ఒకే రైలుపెట్టెలో ప్రయాణిస్తున్నాము.. ఈరోజు నా అదృష్టం బాగుండి కొద్ది సెకన్ల తేడాతో ఆ బోగీ మిస్ అయ్యాను. లేకుంటే నేనూ వాళ్ళతోపాటుగా పడి ఉండేవాడిని.  చిత్రంగా, నేను బ్రతికి బయటపడ్డానన్న సంతోషం కలగడం లేదు. చావును అంత దగ్గరగా, అంత భయంకరంగా చూసిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.

దాదాపు పావుగంట పాటు అక్కడే రైలు పట్టాపై కూర్చుండిపోయాను. ఇంతలో, విషయం తెలిసి ఇంటినుంచి ఫోన్ వచ్చింది. నా క్షేమసమాచారం తెలియ చేస్తుండగానే మొబైల్ ఫోన్ మూగబోయింది. నెమ్మదిగా, కూడదీసుకుని స్టేషన్ చేరుకుని, టాక్సీలో ఇల్లుచేరాను. పలకరింపులకు యాంత్రికంగా సమాధానం చెబుతూ, నిశ్శత్తువగా సోఫాలో కూలబడ్డాను. నా పరిస్థితిని అర్ధం చేసుకున్న మా ఆవిడ నన్నెక్కువ డిస్టర్బ్ చెయ్యలేదు. విషయం తెలిసి, నాకు వస్తున్న ఫోన్లన్నిటికీ తనే సమాధానమిస్తోంది. TV లో న్యూస్ రీడరు చెపుతోంది - కొద్ది నిమిషాల తేడాతో ఏడు చోట్ల బాంబులు పేలాయనీ, మృతుల సంఖ్య దదాపు 150-200 ఉండొచ్చనీ..

ఆ రాత్రి అన్నంకూడా సహించలేదు. ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని మరచి పోలేకపోతున్నాను. ఒకరకమైన కసి, కోపం, నిస్సహాయతా నన్ను ముంచెత్తుతున్నాయి. రోజంతా పోట్టకూటికై పనిచేసి, అలసి సొలసి, తమ గూడు చేరుకుంటున్న ఆ అమాయకులు ఏం పాపం చేసారు? ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? నాకు జీవితంలో మొట్ట మొదటి సారి భగంతుడిపై విపరీతమైన కోపమొచ్చింది. దేవుడు కరుణామయుడు, ఈ సృష్టి పరిపూర్ణమైనది అన్న నా నమ్మకం పూర్తిగా పెకలింపబడింది. ఇలా విపరీతమైన అవేశంతో, అలోచనలతో ఎప్పుడో అర్ధరాత్రి నిద్రలోకి జారుకున్నాను.

*** *** *** ***

చల్లటి స్పర్శ నా నుదుటిపై కలగడంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను. నాచుట్టూ, శరత్పూర్ణిమను మరిపించే చల్లటి ప్రకాశవంతమైన కాంతి...మృదుమధురమైన సన్నటి నవ్వు, నన్ను మలయమారుతంలా చుట్టేసింది. ఆ నవ్వుని బట్టి అర్ధమయ్యింది, నా ఎదురుగా ఎవరో ఉన్నారని... ఎవరో పోల్చుకోలేకున్నాను... కానీ, ఆ చిన్నటి నవ్వులో, స్పర్శలో జాలువారిన ప్రేమ నా మనసుకు తెలుస్తోంది. స్వాంతన కలిగిస్తోంది.

"ఎవరు నువ్వు....మీరు?" అయోమయంతో నా గొంతు పెగలడం లేదు.

మళ్ళీ అదే సెలయేటి గలగల లాంటి నవ్వు..."నా మీద నీకెందుకంత కోపం?"

"నువ్వు... ఐ మీన్, మీరు....దేవుడా?"..ఆశ్చర్యం, ఆనందం, ఇందాకటి కోపం, ఉక్రోషం,ఆవేదన...అన్ని భావాలు ఉప్పెనలా నన్ను చుట్టుముట్టాయి.

నా ప్రశ్నకు సమాధానం, మళ్ళీ చిరునవ్వే అయ్యింది. "నా మీద నీకెందుకంత కోపం?"...అదే ప్రశ్న.

"అన్నీ తెలిసినవాడివి, నా కోపానికి కారణం నీకు తెలియదా?" నా గొంతులో ఉక్రోషం, సంభ్రమం.... రెండూ సమ్మిళితమయ్యాయి.

"సరే అయితే..ఇంకో చిన్న ప్రశ్న. నాగురించి నీకేం తెలుసు?" 
ఆ గొంతులోని మార్ధవం నాకు ఒకవిధమైన ధైర్యాన్నిస్తోంది!  అప్రయత్నంగా, నాకు కరుణశ్రీ కవిత గుర్తుకొచ్చింది:

ఆణిముత్యాల జాలరీ లందగించు
నీల మణిమయ సువిశాల శాలలోన
నొంటరిగ గూరుచుండి క్రీగంట
స్వీయసృష్టి సౌందర్యమును సమీక్షింతు నీవు!

నా మనసులో మాట గ్రహించినట్లే, మళ్ళీ ఇంకో ప్రశ్న. "మరి సృష్టికర్తగా నన్నంగీకరించినపుడు, నా సృష్టినెందుకు సందేహిస్తున్నావు? ఈ సకల చరాచర జీవులు, వాటికి ఆధారమైన ఈ భూమి, నీరు, గాలి,వెలుతురు, ఈ గ్రహాలు, నక్షత్రాలు, అన్నీ కూడిన సమస్త విశ్వం.....నువ్వూ, నేనూ... ఈ సృష్టిలో పరిపూర్ణత నీకు కనబడడం లేదా?"

"పరిపూర్ణతా..? నీ సృష్టిలో అదే ఉంటే, ఇంతమంది అమాయకులెందుకు చనిపోయారు? నాకు తెలిసి వారింత భయంకరమైన చావుకు అర్హులు కారు". నాగొంతులో ఒకింత అసహనం.

"ఈ సృష్టికర్తనే నేనైనప్పుడు, మరి రైల్లో బాంబు పెట్టినవాడినీ, ఆ విస్ఫోటంలో చనిపోయిన వాడినీ సృష్టించింది నేనే కదా?"

నాలో అవేశం కట్టలు తెంచుకొంటోంది. "అదేకదా నా ప్రశ్న. నిన్నే శరణన్న ఇంతమందీ, నిన్ను ప్రేమిస్తోన్న ఎంతోమంది, ఆ బాంబు పేళుళ్ళలో చనిపోయారు... ఎందుకు? ఎందుకు నీ సృష్టిలో ఇన్ని అసమానతలు?"

ఒక్క క్షణంపాటు నిశ్శబ్దం... ఒక పలుచటి చిర్నవ్వు..."ఒక్క ప్రశ్నడుగుతాను... సూటిగా సమాధనం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?"..... ప్రశ్న తీక్షణంగా నా గుండెను తాకింది.

ఆ ప్రశ్నలోని తీక్షణతకు నా గొంతు పెగల్లేదు.

"నా సృష్టిని పూర్తిగా వ్యతిరేకిస్తూ, అపరిపక్వతనూ, అసమానతనూ,అసంపూర్ణతనూ దానికి అపాదిస్తూ, సృష్టి కర్తనైన నన్ను మాత్రం ప్రేమిస్తున్నామంటారు.ఇదెలా సాధ్యం? మనం ఈ ప్రపంచంలో ఎవ్వరినైనా ప్రేమించాలంటే, వారు చేసే పనులను కూడా ఇష్టపడాలికదా? ఒక వ్యక్తిని ప్రేమిస్తూ, అతని పనులను మాత్రం ద్వేషించలేం కదా? అలాగే, నా సృష్టినీ, అందులో మీకు అనందం కలిగించని వాటినీ, అర్ధంకాని వాటినీ ద్వేషిస్తూ, విమర్శిస్తూ, నన్ను మాత్రం ప్రేమించడం ఎలా కుదురుతుంది? ఈ సృష్టిని ప్రేమించడం ద్వారా, ఇష్టపడదం ద్వారా మాత్రమే, సృష్టికర్తను ప్రేమించగలం అన్న సత్యాన్ని ఎవరూ గ్రహించరెందుకు? "

"నిన్నర్ధం చేసుకోవడం చాల కష్టం", కాస్త నిష్టూర పడ్డాను.

"అసలు నన్నర్ధం చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అలా చేయడం మొదలుపెట్టిన నాడు, నా మీద నీకు పూర్తి నమ్మకం లేనట్లే. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఒక్కసారి నీ రెండేళ్ళ చిన్నారిని గమనించు. ఆ చిన్నారి తన అమ్మను పూర్తిగా విశ్వసిస్తుంది, ప్రేమిస్తుంది. తను ఆనందంగా ఉన్నా, ఏడుస్తున్నా అమ్మ చేయి మాత్రం వదలదు. మన్ను తిన్న తన బిడ్డను అమ్మ మందలిస్తుంది, చిన్న దెబ్బ కూడా వేస్తుంది. ఆ బిడ్డ కూడ,ఏడుస్తూ,తనను కొట్టిన అమ్మను ఇంకా గట్టిగా కౌగలించుకుంటుంది కానీ, దూరంగా జరగదు. ఆ మందలింపు, చిన్న దెబ్బ ఆ బిడ్డకు ఆ సమయాన అవసరం. అలాగే, ఇంకొ చిన్న ఉదాహరణ. బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారిని, పాలకి సమయమైందని అమ్మ బలవంతంగా తీసుకుళ్తుంటే, ఆ చిన్నారి కోపంతో ఏడుస్తుంది. ఆ సమయంలో ఆ చిన్నారికి ఆడుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది. కానీ, తనకి అవసరం పాలు త్రాగడం...ఈ విషయం ఆ చిన్నారి గుర్తించకున్నా, తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న అమ్మకు తెలుసు. చిన్నారి కూడా,ఏడుస్తూ అమ్మనే పట్టుకుంటుంది. అదే చిన్నారి కాస్త పెద్దవగానే, తన ప్రపంచం కాస్త విస్తరించగానే,అమ్మను అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అమ్మ మీద కోపం చేసుకుంటుంది. అమ్మ చర్యలను ప్రశ్నిచడం మొదలుపెడుతుంది. అలా తన జీవన పోరాటాం మొదలౌతుంది. అమ్మకు సంబంధించినంత వరకూ, ఏమీ తేడా లేదు... ఎప్పట్లానే తన బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. వచ్చిన దూరమల్లా బిడ్డ వైపునుంచే. అమ్మను అర్ధం చేసుకోవాలనే తన ప్రయత్నం నుంచే".

తను చెప్పింది నాకు పూర్తిగా అర్ధమవ్వడానికా అన్నట్లు, ఒక్క క్షణంపాటు నిశ్శబ్ధం మా మధ్య.

"సరే, నువ్వుచెప్పినదాని ప్రకారం, నిన్ను, నీ సృష్టిని ప్రశ్నిచంకుండా, నిన్ను ప్రేమించాలి. అలా అయితే మరి మా పాత్ర ఏమిటి? నీనుంచి మేమేమి ఆశించాలి? మరి మనిషై పుట్టినతరువాత, రాగద్వేషాలకతీతంగా జీవించడం సాధ్యమేనా? ఇంత స్పష్టంగా కనబడుతున్న, నీ సృష్టిలోని అసమానతలను ఎలా స్వీకరించాలి? మా కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? అసలు ఈ కష్టాలెందుకు? అవసరమైనప్పుడు, నీ నుంచి సహాయం ఆశించే ఆర్తులకు, అది లభించదెందుకు? ఎన్నో సార్లు నీనుంచి మాకు అసంతృప్తి మాత్రమే ఎదురవుతుందెందుకు?" 

నా మదిలో సుడులు తిరుగుతున్న ప్రశ్నల పరంపర. కానీ, ఏమడగాలో తెలియని అయోమయం. అసలు ప్రశ్నించే అవసరమే లేదన్నట్లు, సంభాషణ మళ్ళీ కొనసాగింది.

"నా గురించి,ఎంతోమంది ఆస్తికులు, మేధావులు ఎన్నో వాదోపవాదాలు,ఉపన్యాసాలు చేసారు. ఎన్నో అభిప్రాయాలు,వివరణలు ఇచ్చారు. ఎవరికి వారు, వాళ్ళ వాళ్ళ తెలివిని, తర్కాన్ని, ఇష్టాఇష్టాల్ని, ప్రేమను, భక్తిని ఉపయోగించి, వారికి నచ్చిన దేవుడ్ని సృష్టించేసారు. దేవుడంటే ఇలా ఉంటాడు అన్న అభిప్రాయనికొచ్చేసి, తదననునుగుణంగా నియమ నిబంధనలు ఏర్పరచి, ఎప్పుడైతే వారి అభిప్రాయలకు వ్యతిరేకంగా జరుగుతాయో, ఈ సృష్టినే సందేహించడం మొదలు పెడతారు. అసలు, నాయందు పూర్తి విశ్వాసమున్నవాడు, భయానికీ, భాదకీ, కోపానికీ లోను కాకూడదు. కానీ వీళ్ళందరూ ఏమవుతుందో అన్న భయంతో నన్ను విశ్వసిస్తున్నవారు. వీళ్ళ కంటే నాస్తికులే ఎంతో నయం. నాస్తికులకు, సమస్య ఎదురయ్యినపుడు పిర్యాదు చేయడానికి, వాళ్ళు సృష్టించుకున్న దేవుడుండదు కదా. జీవితాన్ని ఏ విధమయిన సందేహమూ లేకుండా గడిపేస్తారు. మీరు సృష్టించుకున్న దేవుడ్ని కాకుండా, మిమ్మల్ని సృష్టించిన దేవుడ్ని నమ్మిన నాడు, ఏ సమస్యా ఉండదు. 

గులాబీ చుట్టూ ముళ్ళను కల్పించానని, నాకు కౄరత్వాన్ని అంటగడతారు. కానీ ఆముళ్ళు గులాబీరేకుల్ని గుచ్చడం ఏనాడైనా చూసావా? నిజానికి ఆ ముళ్ళే గులాబీని రక్షిస్తాయి".

తన చిరునవ్వు తో పాటు జాలువారే ప్రేమరస కౌముది, నన్ను ముచెత్తుతోంది. తన మాటల ద్వారా ఒకరకమైన స్వాంతన, నమ్మిక కలుగుతున్నాయి..

"సృష్టిలో ఇన్ని అసమానతలెందుకు అన్నది నీ ముఖ్యమైన ప్రశ్న. నీకు పైన కనిపిస్తోన్న ఈ అసమానతలే, సృష్టియొక్క సమానతకు ఆయువుపట్టు. ప్రతీ ఒక్కరూ ధనవంతులైతే, మరి చిన్న చిన్న పనులెవరు చేస్తారు? నేల యొక్క ఎత్తుపల్లాలే కదా నదీ గమనాన్ని నిర్దేశించేది?

ఈ అసమానతలను, అసంపూర్ణత్వాన్నీ ఎప్పుడూ మీవైపునుంచే అన్వయిస్తారు. ఇంకో చిన్న ఉదాహరణ. ఈ సమస్తాన్నీ సృష్టించినది నేనైనపుడు, ఈ సృష్టిలో ప్రతీ జీవినీ సమానంగా ప్రేమిస్తాను కదా? మరైతే, మీ ఆనందాల కోసం, విలాసాల కోసం, ఇతర జీవుల్ని హింసిస్తారెందుకు? ఆ సమానత్వాన్ని ఇక్కడెందుకు అన్వయించరు? ఎందుకంటే, మీకు ఈ సృష్టిలో ఒక ప్రతేకతను మీరే ఆపాదించుకొని,సృష్టిలో మీరుకూడా ఒక భాగమేనని మరచిపోతారు కాబట్టి". 

"మరి నీ సృష్టిలో ద్వందాలెందుకు?" నా ప్రశ్న సూటిగా వెలువడింది. 

"ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, వైపరీత్యం సంభవించినపుడో, ప్రతి ఒక్కరూ ఈ సృష్టిని ప్రశ్నిస్తారు. తమకేమైనా కష్టం కలిగినప్పుడు, ఎందుకు దేవుడా నాకీ కష్టం, నేనేమి తప్పు చేసానని నాకీ కష్టం అని నిలదీస్తారు. మరి, ఒక్కసారి గుర్తు తెచ్చుకో - ఎప్పుడైనా నీకు నచ్చిన విషయం జరిగి, నీకు అమితంగా ఆనందం కలిగినప్పుడు, నాకెందుకింత ఆనందం? నేనేమి చేసానని ఇంత ఆనందాన్నిచ్చావు? అని ఏనాడైనా ప్రశ్నించావా? లేదు. ఎందుకంటే, మీరు జీవితాన్ని ఎప్పుడూ మీ వైపునుంచే చూస్తారు. చిన్న చిన్న పిట్టలను ఎప్పుడైనా గమనించావా? అవి, ఎంతో శ్రమకోర్చి కట్టుకున్న గూడు, వాటిలోని గుడ్లతో సహా, ఏ ప్రకృతి వైపరీత్యం వల్లనో, వేరే జీవి దుశ్చర్య వల్లనో నాశనం గావింపబడితే,అవి తమ తలరాతను తిడుతూ కూర్చోవు. మళ్ళీ మొదటినుంచీ ఇంకో గూడు కట్టడం మొదలు పెడతాయి. ప్రకృతిలోని ద్వందాలను సహజసిద్దంగా స్వీకరిస్తాయి. అలాగే, సృష్టిలో అంతర్భాగమైన ద్వందాలను నువ్వెందుకు అంగీకరించడం లేదు.

శాస్త్రపరంగా సమన్వయ లక్షణ భరితమైన ఈ సౌరకుటుంబం, ఖగోళ శాస్త్ర విరచితమైన ఈ నక్షత్రాలూ, ఈ భూమి, ఋతువులూ, విలక్షణ భరితమైన ప్రాణకోటి, ప్రాణులన్నిటిలోకి తలమానికమైన మానవుడూ - ఇవన్నీ నైపుణ్యం లేని హస్తం నుంచి వచ్చి ఉండవు; అందువలన ఈ సృష్టి అన్యధా ఉండడానికి వీలు లేదు అన్న సత్యాన్ని నీవెందుకు గ్రహించడం లేదు? తుఫాన్లనుంచి కాక, తుఫాన్లమధ్య నిన్ను రక్షించడానికి సిద్దంగా ఉన్న నన్నెందుకు నువ్వు గుర్తించడం లేదు?

ఇందాక నేను చెప్పినట్లు, నీ రెండేళ్ళ చిన్నారికీ, నీకూ తేడా ఏమిటంటే, నీ చిన్నారికి అమ్మ మాత్రమే తెలుసు. అమ్మగురించి తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నించదు.

ఏదైతే మార్పుకి వీలు లేని, దైవనిర్ణయమై నిక్షిప్తమై ఉన్నదో, నీ జీవితంలో ప్రతి సంఘటనా దాని ప్రక్షిప్త ప్రకటన. మానసిక స్తిరత్వాన్ని పునర్ జాగృతం చేసి, ధైర్యాన్ని కూడదీసుకుని ముందుకు సాగిపో".

"చివరిగా నాదింకో ప్రశ్న. ఎంతో మంది తమ జీవిత కాలాన్ని వెచ్చించినా కలగని నీ దర్శన భాగ్యాన్ని నాకెందుకు కల్పించావు?" నా గొంతులో ఇందాకటి సంఘర్షణ లేదు. దాని స్తానే నా గొంతులో ప్రశాంతత, స్పష్టత,విశ్వాసం.

"మృత్యువును కొద్ది క్షణాల తేడాతొ తప్పించుకున్నపుడు, నీ తొలి ప్రతిచర్య ఆనందం కాదు..... అంతమంది చనిపోయారన్న విషాదం. ఆ చర్యే మన సంభాషణకు హేతువు". 

**** **** *****

"ఇదుగో కాఫీ, లేవండి. రాత్రంతా ఒకటే కలవరింతలు. రెండు రోజులు శలవు పెట్టండి. గాలి మార్పుకు ఎటైనా వెళ్ళి వద్దాం", మా ఆవిడ పిలుపుతో ఉలిక్కిపడి నిద్ర లేచాను.





Wednesday, October 3, 2012

మేఘసందేశం





కొద్ది రోజుల క్రితం, ఈనాడు సినిమాలో వచ్చిన 'ముప్పై సంవత్సరాల మేఘసందేశం' అన్న వార్త చదివిన తరువాత, ఫేస్ బుక్ లొ ఈ సినిమా గురించి ఒక చిన్న వ్యాఖ్య రాద్దమనుకున్నాను. కాని మొదలుపెట్టాక తెలిసింది, నాకు మట్టుకు ఈ సినిమా గురించి రాయాల్సింది చాలా ఉందని.

12 ఏళ్ళ వయసులో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరైన రేణిగుంటలో తొలిసారి ఈ సినిమాని చూసాను. మొదట చూసినప్పుడు, కథలోని లోతు పూర్తిగా తెలియరాలేకపోయినా, ఈ సినిమాలోని కొన్ని పాత్రలు, అంశాలు మాత్రం నాపై చెరగని ముద్ర వేసాయి. టీనేజ్ లోకి అడుగుపెదుతున్న నాకూ, నా ఊహలకూ రెక్కలు తొడిగిన తొలి సినిమా మేఘసందేశం. తరువాత కొద్ది రోజులకి ఈ సినిమాని ఒకానొక ఆదివారం మద్యాహ్నం దూరదర్శన్ లో చూసాను. మొదటిసారి చూసినప్పుడు కలిగిన ఫీలింగ్స్ ఇంకాస్త గట్టి పడ్డాయి. ఆ తరువాత్తరువాత ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు.

ఈ సినిమా నాకు చేసిన గొప్ప ఉపకారం, తెలుగు సాహిత్యాన్ని రొమాంటిసైజ్ చేసి పరిచయం చెయ్యడం. అప్పటివరకు చందమామ, బాలజ్యోతిలు చదివే నాకు, ప్రమోషన్ ఇప్పించి తెలుగు కవిత్వపు మాధుర్యాన్ని రుచి చూపించింది. సినిమా చూసిన వెంటనే నేను పావలా పెట్టి పాటల పుస్తకం కొన్నాను. దాదాపు మొదటి సంవత్సరం పూర్తిగా ఈ సినిమా పాటలకు ప్రతిపదార్ధాలు వెదకటమే నా హాబీ అయ్యింది. ఈ సినిమా పాటల పిచ్చి ఎంత తీవ్రమంటే, ఒక్క 'ఆకాశ దేశాన ' పాటపై మాత్రమే మూడు నెలలు గడిపాను. ఈ పాటలొ ఒకచోట 'కడిమి' అన్న పదప్రయోగముంది. మా ఊరి శాఖా గ్రంధాలయంలో వెతికితే, ఈ పదానికి నిఘంటువులలో దొరికిన అర్థము 'పరాక్రమము'. ఈ అర్థముతో ఈ పదము పాటలో నప్పదు. వెదకగా వెదకగా తెలిసింది చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 'కడిమి' అన్న మాండలికానికి 'గడ్డివామి' అనే అర్ధముందని. (వేటురి గారు ఏ అర్ధంతో ఈ పద్దన్ని ఉపయోగించారో, నాకిప్పటికీ సందేహమే!) ఈ సినిమా పాటలకి సంబందించి, ఇటువంటి అనుభవాలెన్నో నాకు. ఇంట్లొ అమ్మ కళ్ళు కప్పడానికి, ఈ సినిమా పాటల పుస్తకాన్ని నా పాఠ్యపుస్తకాల మధ్య పెట్టుకు తిరిగేవాడిని.

ఈ సినిమా చూసిన తరువాత, అక్కినేని నాగేశ్వరరావు నా అభిమాన నటుడైపోయాడు. ఆయన పోషించిన పాత్ర 'రవీంద్ర బాబు' నాకు ఆరాధ్యుడైపోయాడు. నా దృష్టిలో ప్రేమికులందరికీ 'రవీంద్ర బాబు' ఒక బెంచ్ మార్క్. ప్రేమలొ పడటం ఒక గొప్ప అదృష్టమైతే, భగ్నప్రేమికుడవడం మహా గోప్ప అదృష్టమనుకునేవాడిని. ఎందుకంటే, భగ్నప్రేమికులందరికీ కవిత్వం తన్నుకొచ్చేస్తుందనేది అప్పట్లో నా నిశ్చితాభిప్రాయం.

ఎప్పుడెప్పుడు పెద్దవాడినై ప్రేమలో పడదామా, ఆతరువాత భగ్నప్రేమికుడినై గడ్డం పెంచి, సముద్రపు ఒడ్డున తిరుగుతూ హృదయాలను పిండేసే ప్రేమకవిత్వాన్ని రాసిపడేద్దామని కోరికతో రగిలిపోయే వాడిని. 'ప్రియే చారుశీలే' పాటలో జయప్రద కళ్ళు, నృత్యం చేస్తున్నప్పుడు లయబద్దంగా ఊగే ఆమె జడ గుర్తుకొచ్చినప్పుడు మాత్రం, పెదాలపైకి ఒక చిరునవ్వు తన్నుకొచ్చేది. ఆ 'చిరునవ్వు ' కి అర్ధం 'ప్రేమ' అని తరువాత్తరువాత కాస్త పెద్దయ్యాక తెలిసొచ్చింది. ఆ తరువాత జయప్రదకు పెళ్ళైపోయిందని తెలిసొచ్చింది. శ్రీకాంత్ నహతాపై కోపం పొడుసుకొచ్చింది. తరువాత, జయప్రదని ప్రేమించడం కష్టమని తెలివొచ్చింది. కానీ, ఈ సినిమాపై పిచ్చి మాత్రం ఇంకా గట్టి పడింది.

ఆ తరువాత, ఇంకాస్త పెద్దయ్యాక, శ్రీశ్రీ మరియు తిలక్ కవిత్వపు హోరులో ఉక్కిరిబిక్కిరి అవుతూంటే నన్ను కాస్త పక్కకి లాగి, సేదతీర్చి, దేవులపల్లి కృష్ణశాస్త్రిని పరిచయం చేసింది ఈ సినిమానే. 'ముందు తెలిసెనా ప్రభూ..' పాటను వింటూ, మైమరచి, ఆ మాధుర్యపు రుచి మరిగి, ఇంకాస్త తవ్వితే ఆయన 'కృష్ణ పక్షం ' పరిచయమయ్యింది. అట్నుంచి టాగోర్ గీతాంజలి, తద్వారా చలం సాహిత్యం...ఈవిధంగా ఈ సినిమా నాకో దిక్సూచి అయ్యింది.

అయితే, ఇంతగొప్ప సినిమాకి సంబంధించిన ఒక్క నమ్మలేని నిజం మాత్రం నన్ను తొలుస్తూనేవుంటుంది... అదే, దాసరి నారాయణరావు నిజంగానే ఈ సినిమాకి డైరక్టరా? ఇంతగొప్ప సినిమ తీసిన వ్యక్తేనా పరమవీరచక్ర, అడవిచుక్క లాంటి సినిమాలు తియ్యగలిగింది? ఈ క్షీణత నాకు ఇప్పటికీ కొరుకుడు పడని విషయమే!

Thursday, February 24, 2011

రమణీయం..స్మరణీయం!


కొహోతి కొమ్మచ్చి
కొమ్మకి రెమ్మొచ్చి
రెమ్మకి పువ్వొచ్చి
పువ్వుకి నవ్వొచ్చి
నవ్వుకి నువ్వొచ్చి
రమణకు బాపొచ్చి..
బాపుకు రమణొచ్చి...
బాపురమణలు మనకొచ్చి...
కోతి కొమ్మచ్చి...
(ఇం)కోతి కొమ్మచ్చీ...
మరి (ము)క్కోతి కొమ్మచ్చో....?

నకనకలాడే ఆకలి, చిల్లు పడిన జేబు,
పుట్టిన దౌళేసరం..చెడి చేరిన చెన్నపట్నం
అమ్మతో పంచుకున్న మసాలదోశా..
అరటిదొప్పెలోని చక్కెర పొంగలి..
అప్పులూ, తిప్పలూ...ముప్పులూ
విరిగిపోయిన కప్పులూ
సిగరెట్టు ముక్కలూ
కావేవీ జొకులకనర్హం!

నవ్వడం మరచిపోయిన మన టెల్గూస్ ని,
చెవిపట్టి మెలితిప్పి, తేనెలతేటల తెలుగుని
మళ్ళీ పరిచయం చేసి
నవ్వడం అలవాటు చేసిన ముళ్ళపూడి వెంకటరమణా..
బాపు చేత గొప్పన్నర బొమ్మలు వేయించిన
గొప్ప కథలు రాసిన
తొమ్మిదమ్మల ముద్దుబిడ్డవు..
నువ్వు లేవు అంటే నమ్మడమెలా...?

సరస్పత్తోడు,బాపురమణీయంలో సగమికలేదు!

అదేమిటీ...నిన్ననేగా, ఈకొమ్మమీదనుంచి ఆ రెమ్మమీదకు గెంతుతూ,
తన కోతికొమ్మచ్చితో నవ్వుతూ, నవ్విస్తూ ఏడిపించింది...
అప్పుడే ఏమయ్యిందీ...?

ఇప్పుడేమయ్యిందనీ...? రమణ ఎక్కడికి వెళ్ళాడనీ?
ఇక్కడే ఉన్నాడుగా...మన మధ్యే..నవ్వుతూ, నవ్విస్తూ...
నవ్వుకు చావేంటీ?
రమణకు మరణమేమిటీ...?
బాపూరమణీయం..
కడు రమణీయం......
సదా స్మరణీయం....

Sunday, May 9, 2010

అమ్మకు ఉత్తరం

అమ్మా!

హ్యాపీ బర్థ్ డే! ఈ రోజు 'మదర్స్ డే'. అందుకే, నీకు హ్యపీ బర్థ్ డే తో పాటుగా, 'హ్యాపీ మదర్స్ డే' కూడా...!

ప్రతి సంవత్సరమూ ఇదే రోజు, పొద్దున్నే ఈ మాటలు నీకు ఫోన్ చేసి చెప్పేవాడిని. కానీ ఈసారి, అలా చెప్పడానికి నువ్వు లేవు. అందుకే, నీకు రాస్తున్నట్లు నాకు నేను ఈ ఉత్తరం రాసుకుంటున్నాను.

నీకిలా ఉత్తరం రాస్తుంటే, చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు, మనం రాసుకున్న ఉత్తరాలు గుర్తుకొస్తున్నాయి.

ఎవరో అన్నట్లు, మరణాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే అది మనకు అత్యంత ఆప్తులను కబళించాలి. ఎంత నిజం! కానీ, నువ్వు గమనిచావో లేదో, మరణం మనిద్దరినీ భౌతికంగా దూరం చేసిందేమో కానీ, ఇప్పుడు మనం మానసికంగా ఎంతో దగ్గరయ్యాం. ఇంతకముందు, నీతో మాట్లాడాలంటే, నీకు ఫోన్ చెయ్యాల్సొచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. నాతో నేను మాట్లాడుకుంటే చాలు, నీతో మాట్లాడినట్లే.

ఆరోజు నాకింకా గుర్తుంది. కోల్పోవడానికి కూడా ఏమీ మిగలని పరిస్థితులలో, భుజాలపై ఇద్దరు పిల్లల బాధ్యత, భవిష్యత్తుపై ఆశ, గుండెనిండా ధైర్యము, జీవితంలో గెలవాలన్న పట్టుదల... కేవలం ఇవి మాత్రమే ఆలంబనగా, ఇరవైయ్యారు సంవత్సరాల క్రితం అంగన్ వాడి టీచర్ గా నువ్వు ఉద్యోగంలో చేరడం నాకింకా గుర్తుంది. ఏడుగురు తోబుట్టువులున్నా, ఎవ్వరినీ ఏమీ అర్ధించక, నీ ఆత్మాభిమానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, కష్టాలన్నిటినీ చిరునవ్వుమాటున దాచిపెట్టి, మమ్మల్ని పెంచి పెద్దచేసిన తీరు నేనెలా మరచిపోగలను చెప్పు.

ఇంకో విషయం గుర్తుందా నీకు? అప్పట్లో మనింట్లో ఒక రూల్ ఉండేది. రోజంతా ఎక్కడ తిరిగినా, రాత్రి భోజనం మాత్రం ముగ్గురమూ కలసే చేసేవాళ్ళం. నవ్వుకుంటూ సరదాగా కబుర్లుచెప్పుకుంటూ, వర్తమానాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ, భవిష్యత్తును కలల్లో ఆవిష్కరించుకుంటూ, తృప్తిగా భోంచేసేవాళ్ళం. ఈ పద్దతిని, నా ఇంట్లో పాటించాలని ఎంత ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. నేనింటికొచ్చేటప్పటికి, తొమ్మిది దాటిపోతుంది. ఒక్కోసారి, ఆ టైముకి పన్నుగాడు నిద్రలో ఉంటాడు. అప్పుడు చాలీచాలని కూరలూ, పచ్చడి మెతుకులే అయినా ఎంతో తృప్తిగా కడుపుతో పాటూ, మనసు కూడా నిండిపోయేది. ప్చ్... అరోగ్యం కోసం తినే ఆ రెండు పుల్కాలతో ఇప్పుడు కడుపూ, మనసూ రెండూ నిండట్లేదు.

మనిద్దరమూ ఇంత క్లోజ్ గా ఉండడం చూసి, ఊళ్ళో అందరూ అడిగేవారు... తల్లీ కొడుకులు ఫ్రెండ్స్ లా ఉండడం ఎలా సాధ్యం అని? నాకెంత గర్వంగా ఉండేదో! నాకు చిన్నప్పుడు ఇన్ని కష్టాలనిచ్చినందుకు దేవుడిపై ఎప్పుడూ నిష్టూరపడలేదు...ఎందుకంటే, ఆకష్టాలకు మారుగా నీ లాంటి అమ్మనిచ్చాడు. ఇంకేమి కావాలిచెప్పు నాకు. నిన్నింత తొందరగా నానుంచి తీసుకెళ్ళాడని, ఇప్పుడుకూడా దేవుడిపై నాకు కోపం లేదు. ఎందుకంటె, నాకు నువ్విచ్చిన గొప్ప ఆస్తి - ప్రశ్నిచకుండా జీవితాన్ని అనుభవించే విద్య.

అన్ని కష్టాలతో నిండిన జీవితాన్ని ఎంత హుందాగా అంగీకరించావో, అంతే హుందాగా మరణాన్ని కూడా హత్తుకున్న తీరు నాకు రెండు గొప్ప పాఠాల్ని నేర్పింది. ఆరోజు ఐసీయూలో నువ్వుసాగించిన చివరి పోరాటం, నా జీవితపు పరిధిని పునర్నిర్వచించింది. నా కష్టాలు ఎంత చిన్నవో నాకు తెలిసొచ్చింది. నీ మరణం నన్ను మరింత ధృడంగా తయారుచేసింది.

నీ చివరి కోరిక ప్రకారం, అంత్యక్రియలకోసం నిన్ను మనూరికి తీసుకెళ్ళిన నాకు, నువ్విచ్చిన చివరి పాఠం ఎదురయ్యింది. నీ కోసం ఊరు మొత్తం ఎదురు చూస్తూ ఉండింది. ఉద్యోగాల్లో ఎక్కడెక్కడో స్తిరపడ్డ నీ స్టూడెంట్సందరూ, చివరి చూపుకోసం వచ్చారు. తాము ఇష్టంగా "టీచరమ్మ" అని పిలుచుకునే నీ అంతిమ యాత్రకు ఏర్పాట్లు నా ప్రమేయం లేకుండానే చేయబడ్డాయి. అన్నిటికంటే నిన్ను నాకు పూర్తిగా ఎరుకపరచిన సంఘఠన - పూటగడవడం కోసం రోజువారి కూలీపై ఆధారపడే 'హరిజనవాడ ' ప్రజలు, తమ తమ పనుల్ని విడచిపెట్టి, పెద్ద గజమాలతొ ఊరేగింపుగా చివరి చూపుకోసం వచ్చిన తీరు, నీలోని ఇంకో పార్శ్వాన్ని ఆవిష్కరించింది. నాకు అప్పుడు అర్ధమయ్యింది - జీవితమంటే ప్రేమించడానికి, ప్రేమింపబడడానికి మనకివ్వబడిన ఒక అవాకాశం.

ఈ రెండు పాఠల్నీ నేనెప్పటికీ మరచిపోనమ్మా....!

ఉంటాను మరి,

Sunday, August 23, 2009

అమ్మకు అశ్రునివాళి!



'అమ్మ ' పదానికి నిండు అర్ధం
మానవత్వపు నిలువటద్దం,
మంచితనానికి మనిషి రూపం,
నా జన్మజన్మల అదృష్టం
నీ ఋణం ఎలా తీర్చుకోను?

పీడకలకు బెదిరిపోయి
నిద్రలేచి ఏడుస్తుంటే,
గుండెకదుముకొని జోలపాడి
ఊరడించిన నిండు పున్నమి
నీ ఋణం ఎలా తీర్చుకోను?

కష్టాల చీకటిలో చిక్కుకొని
దిక్కుతోచక నిలచిపోతే,
వెలుగుదివ్వెగ మారి నాకు
దారి చూపి కరిగిపోయిన వెన్నెలమ్మా,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

అలసటెరుగని బ్రతుకుపోరులో
బాధనంతా తొక్కిపెట్టి,
నవ్వు మాత్రం మాకుపంచి
నువ్వేమో మాయమైతివి, మాతృమూర్తీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

రెక్కలొచ్చిన బిడ్డ ఎగిరిపోతే,
మధ్య పెరిగిన దూరాన్ని మరచి,
బిడ్డ ఎగిరిన ఎత్తు చూసి
మురిసిపోయిన పిచ్చితల్లీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

గోడమీద వాలిన కాకి అరిస్తే,
బిడ్డ వస్తాడన్న ఆశ,
వీలు పడక రాలేదని
సర్దిచెప్పుకున్న వెర్రితల్లీ,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

నుదిటి మీద వెచ్చని ముద్దు,
నువ్వు పెట్టిన గోరుముద్ద,
నిద్రపుచ్చిన పిట్టకథలు,
నాకుమిగిలిన తీపిగురుతులు.
అమ్మా, నీ ఋణం ఎలా తీర్చుకోను?

నా ఎదుగుదలకు పునాదివి,
గుండెనిండా స్థైర్యానివి,
బ్రతుకుబాటన మార్గదర్శివి,
ప్రాణమిచ్చిన పసిడిముద్దా,
నీ ఋణం ఎలా తీర్చుకోను?

కళ్ళముందే పువ్వులా
నువ్వు కరిగిపోతుంటే,
నెలరోజుల పోరాటం
నిన్ను నిలుపలేకపోతుంటే,
వెక్కిరించిన నిస్సహాయత...
అమ్మప్రేమకు నోచుకోని
కన్నుకుట్టిన దేవుడు,
స్వర్గానికి నిన్ను
పిలుచుకెళ్ళాడు కాబోలు...

గుండెనిండా తీపిగురుతులు,
తోడుగా ముప్పైఅయిదేళ్ళ అనుబంధం,
ఉబికివచ్చే కన్నీళ్ళు,
ఇవి మాత్రమే మిగుల్చుకున్న అసక్తుణ్ణి!

అందనంత ఎత్తులో ఉన్న నిన్ను
అక్షరాలలో ఆవిష్కరించాలన్న
నా వృధా ప్రయత్నం,
నీవు నేర్పిన మాటలే
గుండెగొంతున కొట్టుకుంటూ,
కన్నీరుగా మారి
మసకబారిన చూపు..
నిశ్శబ్ధంగా రోదించడం తప్ప
ఏమీ చెయ్యలేని అసక్తుణ్ణి!
నన్ను మన్నించు అమ్మా...అసక్తుణ్ణి నేను.


(నెలరోజులపాటూ మణిపాల్ హాస్పిటల్లో సాగించిన పోరాటం వృధా అయ్యి, నిస్సహాయుణ్ణై నేను చూస్తుండగానే, జూలై పంతొమ్మిదిన, యాభై ఏడేళ్ళ వయసుకే ఇక శలవంటూ వెళ్ళిపోయిన అమ్మకు స్మృత్యంజలి - గిరీష్.)

Monday, January 26, 2009

రాధామాధవీయం!


తన ఓటమిని అంగీకరిస్తూ, చీకటిని ఆహ్వానించడానికి పశ్చిమాన భానుడు సిద్దమౌతున్నాడు. ఆకాశంలో అరుణం బూడిదరంగులోనికి మసకబారుతూ, రాత్రిని స్వాగతిస్తోంది. క్షణక్షణానికీ పెరుగుతోన్న సాయంకాలపు నీడలను తన హృదయానికి హత్తుకుంటూ, మందగమన అయిన యమున, లయబద్దమైన తన గలగలతో బృందావనాన్ని జోకొట్టడానికి సిద్దంగాఉంది. చీకటివెలుగులకు తన వెండిమెరుపులను అద్దడానికి చంద్రుడు ఉత్సాహంగా ఉరకలువేస్తున్నాడు.

కానీ, యమున హొయలనూ, చంద్రుడి ప్రభనూ గమనించే స్థితిలో బృందావనమూ, అందులోని గోపకాంతలూ లేరు. తమ మానసచంద్రుడైన ఆ నందనందనుడు చెంతలేని లోటును, ఆ శరత్చంద్రుడేమాత్రం పూరించగలడు? ఆ మురళీకృష్ణుడి వేణుగాన సమ్మోహనాన్ని, శరత్పూర్ణిమ చల్లదనం మరిపించగలదా?

దారిపొడవునా తమ హృదయపు తివాచీని పరచి, చూపులతో తోరణాలల్లి ఆ లీలామోహనుడి రాకకోసం ఎదురుచూస్తున్నారు ఆ గోపికలు.

విరహబాధను ఓపలేని ఓ గోపిక, "కన్నయ్య మనతో ఉన్నంత సేపు ఘడియలు క్షణాలౌతాయి. తను మనచెంత లేనప్పుడు క్షణమొక యుగమౌతుంది" అంటు వాపోయింది.

"ఆహా, కనీసం వెదురుముక్కనైనా కాకపోతిని కదా, తన చేతి మురళినై కన్నయ్య సన్నిధి అనే పెన్నిధిని శాస్వతంగా పొందేదాన్ని" ఇంకొక గోపిక బాధపడింది.

"తను మనతో ఉన్నంతసేపూ, ఎప్పుడు వెళ్ళిపోతాడోనన్న భయం. వెళ్ళిపోగానే, మళ్ళీ ఎప్పుడొస్తాడోనన్న దిగులు, ఎదురుచూపు. నేను భరించలేకున్నాను సఖీ, ఈ ఎడబాటును...."

“గోవర్ధనగిరిని అలవోకగా ఎత్తిన ఆ గిరిధరుడు, దుఖభారముతో క్రుంగిన మన మనస్సులను పైకెత్తలేడా... పూతనాది రాక్షసులను అవలీలగా సంహరించిన వాడు తన ప్రత్యక్షమాత్రముచే మన విరహాగ్నిని హరించలేడా....” ఇలా తర్కించుకున్న కొద్దీ, వారి గుండెలు బరువెక్కి, దుఖం కన్నీరై ఉబికివస్తోంది.

ఇంతలో అందరి కళ్ళూ, ఓ పక్కన నిశ్శబ్ధంగా కూర్చున్న రాధపై పడ్డాయి. చిత్రంగా, రాధ మోములో చింత లేశమాత్రమైనా లేదు. దుఖపు ఆనవాలూ లేవు. వేయి పున్నముల ప్రకాశాన్ని వెదజల్లుతున్న మఖచంద్రముతో, ప్రశాంతవదన అయి, కృష్ణుడు తనచెంతలేడన్న బెంగ ఏమాత్రమూ లేనిదై, అలౌకికానంద స్థితిలోనున్న రాధను చూసిన గోపికలు ఆశ్చర్యచకితులయ్యారు.

"మన రాధమ్మను చూడవే. కన్నయ్య చెంతలేడన్న బెంగ అస్సలు లేదు. ఈ ఎడబాటును భరించలేక, క్షణమొక యుగమై, విరహాగ్నిలో జ్వలిస్తున్న మనమెక్కడ, ఏ మాత్రమూ చీకూచింతలేని ఈ రాధ ఎక్కడ? అయినా కానీ, కన్నయ్యకు ఈ రాధే ప్రియసఖి...", ఆశ్చర్యము, కాస్త అసూయతో ఓ గోపిక నిరసించింది.

"తనకోసం తపనపడే మనమెప్పుడూ కన్నయ్య కళ్ళకు కనిపించం. తనకోసం అంతగా ఆరాటపడని ఆ రాధమ్మంటే ఎంతప్రేమో..." ఇంకో గోపిక నిష్టూరమాడింది.

కృష్ణుడిపై ఉన్న అపారమైన ప్రేమ వలన కలిగిన చనువుతో, తనను చూడవలెనన్న గాఢమైన కోరికతో, పరిపరివిధాలుగా వారు మాట్లాడుకొంటుండగానే, ఆ గొపికలకిష్టుడు, గోపాలకృష్ణుడు రానే వచ్చాడు. ఆ నందనందనుడి మురళీగానం వారిని ఆనందలోకాలలో విహరింపజేస్తోంది. ఆ నల్లనయ్య కాలి మువ్వల సవ్వడి వారి మనసులలో అలజడిరేపుతోంది.

అంతవరకూ ఎవ్వరిరాకకై పరితపించారో, ఆ సమ్మోహనాసుందరుడు రానేవచ్చాడు.
కన్నయ్యను చూసిన ఆనదాతిశయాలనుంచి వారందరూ తేరుకోకమునుపే, వారెవ్వరినీ చూడనట్టే, నేరుగా రాధ దగ్గరికెళ్ళాడు.

తనువచ్చాడన్న హర్షాతిరేకంలో తమ బాధాతప్తహృదయాలు సేద తీరకమునుపే, తమని అలా నిర్లక్ష్యం చెయ్యడం ఆ గోపికలను చాలా క్లేశానికి గురిచేసింది. ఇంతసేపూ తాముపడ్డ వేదన, తమని అలక్ష్యం చేసాడన్న బాధ, కోపం, తనకోసం ఏమాత్రమూ చింతించని రాధ దగ్గరకే వెళ్ళాడన్న అసూయ, అన్ని భావాలూ కలిసి ఖిన్నులై చూస్తుండగానే, ఆ అల్లరివాడు మబ్బుచాటు చంద్రుడివలే మాయమయ్యాడు.

బృందావనం తెల్లబోయింది! కన్నయ్య వచ్చాడన్న గోపకాంతల ఆనందం, తమను పలకరించలేదన్న కోపంగామారి, అంతలోనే అదృశ్యమవడంతో ఆశ్చర్యంగా రూపాంతరంచెంది, దుఖతరంగమై ఉవ్వెత్తున ఎగసిపడింది. నీళ్ళునిండిన కళ్ళతో, మసకబారిన చూపుతో ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా, ఆ నల్లనయ్యకోసం గాలించసాగారు. వచ్చినట్లే వచ్చి మాయమైన ఆ మాయామోహనుడి కోసం శరీరమంతా కళ్ళు చేసుకొని వెదకసాగారు.

కన్నీటియమునలో మునిగిన గోపికల మదిలోని తమస్సును హరిస్తూ, కృష్ణోదయపు ఉషస్సు మళ్ళీ ప్రకటితమయ్యింది. వియోగం మహద్భాగ్యానికి పునాది అయ్యింది. విషాదం వికాసానికి హేతువయ్యింది. పద్మనయనంబులవాడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఒక్కడు కాదు. ఇద్దరు కాదు. ఎటుచూసినా కృష్ణులే. ప్రతి గోపిక పక్కనా కృష్ణుడే. ఇద్దరు కృష్ణులనడుమ గోపిక. ఇద్దరు గోపికలనడుమ కృష్ణుడు. ఎటుచూస్తే అటు కృష్ణుడు. అంతా కృష్ణమయం. బృందావనం ఆనందవనమయ్యింది. ఆనందం అనంతమయ్యింది. అనంతుడు అంతా తానయ్యాడు.

వియోగంతో ఉబికిన కన్నీటి చుక్క చూపును మసకబారిస్తే, సంయోగంతో కలిగిన ఆనందాశ్రువు కుంభాకారకటకమై కృష్ణుడిని మరింతదగ్గరగా ఆవిష్కరించింది.

ఆ గిరిధరుడి అధరసంగమ మాధుర్యాన్ని మోసుకొచ్చే మురళీరవళి, ఘల్లుఘల్లుమంటూ మ్రోగే అందెల చడి,బృందావన పరిమళాల ఘమఘమలు, ఉరకలెత్తే యమున గలగలలు,శరత్చంద్రుడి మిలమిలలు, వీటన్నిటినీ మించి సుందర సమ్మోహనాస్త్రభరితమైన ఆ నల్లనయ్య నాట్యం. బృందావనం పరవసించింది.

జీవితానికి సరిపడా అనుభవాన్ని మూటగట్టుకున్న గోపికలు, అలసి సొలసి కన్నయ్య చెంత చేరారు. మెలమెల్లగా స్పృహలోకొచ్చిన గోపికలు, విడిపోవలసిన సమయమాసన్నమైనదన్న ఎరుక గలిగి, తమను వీడిపోవలదని కన్నయ్యను వేడుకొన్నారు.

వాళ్ళ ఆవేదనను కృష్ణుడు చిరునవ్వుతో చూస్తున్నాడు. చిత్రంగా, కృష్ణుడి పక్కనేవున్న రాధమోములో ఏ మాత్రమూ ఖేదము లేదు. దాన్ని చూసిన గోపికల గుండెల్లో చిన్నపాటి అసూయావీచికలు.

అంతా గమనిస్తున్న కృష్ణుడు, ఇలా చెప్పాడు.

"నా ప్రియసఖులారా, ఇతరులు మనల్ని ప్రేమించేలా చేసుకోవాలంటే, ఒకటే మార్గం మనం వాళ్ళ ప్రేమకి ఎంత అర్హులమో చెప్పటం కాదు. వాళ్ళనుంచీ ఏమీ ఆశించకుండా ప్రేమించడం మాత్రమే. సంభాషణ కాదు, సాన్నిహిత్యమే ప్రేమకు భూషణం. త్యాగం ప్రేమకి హృదయం. షరతులు లేని ప్రేమతో మీ హృదయం ఒక్కసారి నిండితే చాలు, మీరు నన్ను సాధించినట్లే.

నా చేతిలోని ఈ మురళిని చూడండి. ఒక చిన్న వెదురుముక్క, తన శరీరాన్ని చిద్రం చేసుకొని, ఎంతో కష్టాన్నోర్చి ఎనిమిది రంధ్రాలతో మురళిగా మారింది కాబట్టే, నా చేతి ఆభరణమయ్యింది. నాకే అలంకారమయ్యింది. చేత మురళి లేని నన్నూహించగలరా మీరు?

నా ప్రేమ, వివేకం పట్ల అచంచలమైన, షరతులులేని విశ్వాసమే, మీ దుఖాలన్నిటికీ పరిష్కారం. నేను ప్రక్కనున్నా, లేకున్నా, రాధ మోములోని ప్రశాంతతకు కారణం ఈ విశ్వాసమే. నేను భౌతికంగా తనప్రక్కన లేకున్నా, గుండెలనిండా నన్నేనిలుపుకున్న తను ఏనాడూ, నాకు దూరం కాలేదు. నాతోడును శాస్వతంగా పొందిన తనను, దుఖం దరి చేరదు.

ఒక చిన్న విషయం గుర్తెరగండి. మాయ వలన నేను మాయమవ్వలేదు. నేనులేకపోవడంవలనే మాయ మిమ్మల్ని లోబరుచుకుంది. మీరు దుఖావేశాలకు లోనయ్యారు.

జీవించడానికే ప్రేమిద్దాం. ప్రేమించడానికే జీవిద్దాం. జీవితాన్ని సంపూర్ణంగా అంగీకరిద్దాం. అలా అంగీకరించిన నాడు, ప్రతీ ఒక్కరి జీవితం బృందావనమే! జీవనం ఆనందనర్తనమే!”


గోపకాంతల మనోనేత్రాలను కమ్మిన పొరతొలగింది. సందేహపు కారుమబ్బులు విడిపోయాయి. జగమంతా కృష్ణమయంగా కనపడుతోంది. తనప్రక్కన కృష్ణుడు. తనలోన కృష్ణుడు. రాధలో కృష్ణుడు. రాధతో కృష్ణుడు. అంతా కృష్ణుడే! అన్నిటా కృష్ణుడే!

అహా, వినండి. ఆ కమ్మని వేణుగానం మన మనోద్వారకాద్వారాలు మీటి, మనలోని బృందావనాన్ని ఆవిష్కరిస్తోంది. సందేహపు మరకల్ని కడిగేస్తోంది!

Friday, January 2, 2009

మా ఆవిడా, నేనూ., నా అంతరాత్మ!

బెంగళూరు, ఓ ఆదివారం, తెల్లవారుజామున 10 గంటలు!

ఒళ్ళుమరచి నిద్దురపోతున్న నేను, ఎవరో దుప్పటి బలంగా లాగడంతో, ఉలిక్కిపడి లేచాను. డిస్టర్బ్ చేసింది ఎవరా అని చూస్తే, ఎదురుగా నా అంతరాత్మ. "ఇప్పుడెందుకొచ్చావురా బాబూ, కాసేపు నన్ను పడుకోనీ..." అంటూ మళ్ళీ నిద్రకుపక్రమిస్తున్న నన్ను బలంగా మంచమ్మీదనుంచి లాగేయడంతో,నిద్ర లేవక తప్పింది కాదు.

చిన్నప్పుడు జస్టిస్ చౌదరి సినిమాలో తన అంతరాత్మ వచ్చి పెద్ద ఎన్టీఅర్ తో సంవాదం చేయడం చూసినప్పటినుంచీ, అప్పుడప్పుడూ నా అంతరాత్మకూడా నాతో మాట్లాడం మొదలుపెట్టిందిలెండి.

"ఏమిటొ చెప్పు..." విసుగ్గా కసిరాను.

"నిన్న మీ ఆవిడ ఊరెళ్ళింది...నీకసలు గుర్తుందా?" కోపంగా ప్రశ్నించాడు రామలింగం, అదే నా అంతరాత్మ గాడు.

మా ఆవిడ ఊరెళ్ళిన విషయం గుర్తుకురాగానే ఒక్కసారిగా ఆనందం తన్నుకొచ్చింది కానీ, ఈ రామలింగం గాడిముందు అలుసైపోవడమెందుకని కంట్రోల్ చేసుకుని, "అయితే ఏంటట..." అన్నాను బింకంగా.

"లేక లేక దొరికిన గోల్డెన్ చాన్సుని, ఇలా నిద్రపోతూ వేస్టు చేసుకుంటావా? కాంతం లేని ఏకాంతాన్ని, కాస్త ఎంజాయ్ చేసే ప్లానేమన్నా ఉందా?" వాడి కోపం ఇంకా తగ్గినట్లు లేదు.

ఏమిచేద్దాం అన్నట్లు సాలోచనగా వాడివైపు చూసాను.

"మొదట అర్జెంటుగా వెళ్ళి బీరుబాటిళ్ళు తెచ్చి ఫ్రిజ్ నింపేసేయాలి", రామలింగం తన కోర్కెల చిట్టా విప్పాడు. కరో...కరో జల్సా..." బీరు ప్రసక్తి రాగానే వాడిలోని ఆనందం రెట్టింపయ్యి,. పాట రూపంలో తన్నుకొస్తోంది.


"ఆ తరువాత హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని, చల్లటి బీరు కొడుతూ, 'సింగ్ ఈజ్ కింగ్' డివిడి చూడాలి" అసెంబ్లీలో మైకు చేతికి దొరికిన తరువాత రోశయ్యలాగ రామలింగం రెచ్చిపోతున్నాడు.


ఇంతలో ఫోన్ మోగింది. నేనూహించినట్లే మా ఆవిడనుంచే ఫోను. రాక్షసి, నేనెప్పుడు బీరు గురించి అలోచించినా వెంటనే, తన పతి ఆలోచనలను టెలీపతీలో తెలుసుకొన్నట్లు, ఠంచనుగా, "నేను గమనిస్తూనే ఉన్నాను సుమా" అని ఏదో ఒకవిధంగా నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది.


ఏమి చేస్తున్నారంటూ, అనుమానంతో కూడిన ప్రేమతో, నా బుర్రలో ఏముందో కాస్త కూపీ లాగడానికి ప్రయత్నించి,ఈ మూడు రోజులూ నేను తీసుకోవలసిన జాగ్రత్తలను ఇంకోసారి వల్లె వేసి, నేను చెయ్యాల్సిన మార్నింగ్ వాక్ ని మరోసారి గుర్తుచేసి, రెండుగంటలు మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేసింది.


రామలింగం ధుమమలాడిపోతున్నాడు. నేను వాడివైపు అపాలజెటిగ్గా, సర్ది చెబుతున్నట్లు చూసాను. "నిన్న ఊరెళ్ళినావిడకి, రెండుగంటలసేపు మాట్లాడటానికి విషయాలేముంటాయి?" వాడి గొంతులో కోపం నాకు తెలుస్తూనే ఉంది.


"మొగుడూ పెళ్ళాలన్నతరువాత ఆ మాత్రం కబుర్లుండవా ఏంటి?" సాధ్యమైనంతవరకు మామూలుగా ధ్వనించడానికి ప్రయత్నించాను.


"ఓహో, వాటిని కబుర్లంటారా....ఇంటరాగేషనులాగుంటేను, డౌటొచ్చిందిలే..." ఎత్తిపొడిచాడు.

వీడినిలాగే వదిలేస్తే నా పరువు గంగలో కలిపేస్తాడనిపించి, బయటకెళ్ళి బీరు, బిర్యానీ తెచ్చే నెపంతో, తయారవ్వడానికి బాత్రూంలోకి దూరాను.

త్వరత్వరగా రెడీ అయ్యి వెళ్ళి, బీరు, కాసిన్ని స్నాక్సూ, నందినీ నుంచి బిరియానీ తీసుకొచ్చాను.

"పెళ్ళయిన ఏడేళ్ళలో ఎంత మారిపోయావ్? నన్నసలు పట్టించుకోవడమే మానేసావు. మనమిలా కూర్చొని బీరుకొట్టి ఎన్నాళ్ళైందో గుర్తుందా..?" చికెన్ ముక్క కొరుకుతూ రామలింగం నిష్టూరపడ్డాడు.

టాపిక్ మార్చడానికన్నట్లు, టీవీ ఆన్ చేసాను. కానీ, విషయాన్నంత తేలిగ్గా వదిలేసేవాడైతే వాడు నా అంతరాత్మ గాడెలా అవుతాడు...

"నీ ఇష్టాఇష్టాల్ని, సంతోషాల్ని అంత తేలిగ్గా ఎలా మరిచిపోగలిగావ్?" నిలదీసాడు.

"నీకూ, నాకూ పెద్ద తేడా ఏముంది...నా సంతోషమే నీ సంతోషం...I am happily married. నేను సంతోషంగానే ఉన్నాను" అని సర్ది చెప్పబోయాను.

"అవునవును...నీ సంతోషం సంగతి నాకెందుకు తెలీదు. నీకు పెళ్ళైంది, మీ ఆవిడ సంతోషంగా ఉంది, you both are happily married!"...రామలింగం నన్ను దెప్పి పొడవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోడు.

"సరేలేరా...మరీ అంత ఫీలవ్వకు. పెళ్ళి అనేది ప్రతిఒక్కరి జీవితంలో అంతర్భాగమే. పెళ్ళయ్యాక మార్పు కూడా సహజమే. అందుకు నువ్వు అలా దెప్పక్కర్లేదు.పెళ్ళయ్యిన తరువాత కాస్త బిజీఅయ్యి, నీతో ఎక్కువ టైముగడపలేదు. అయినా పెళ్ళికిముందు నీతో వివరంగా చర్చించే నిర్ణయం తీసుకున్నానుకదా... ఇప్పుడు దీనికి నన్ను మాత్రమే భాద్యుడిని చేస్తావే?"

"అవును, agreed. ఒక్కసారి మనమేమి డిస్కస్ చేసామో గుర్తుతెచ్చుకో. నీ పెళ్ళికి నేను పెట్టిన ఒకేఒక్క కండీషను, నీ ఇష్టాఇష్టాలకు ఏమాత్రమూ తేడారాకూడదు. అంతా నీ అభీష్టం ప్రకారమే జరగాలి అని. కానీ, నువ్వుమాత్రం ఈ సూత్రాన్ని, మాంగళ్యసూత్రధారణ తరువాత పూర్తిగా మరచిపోయావు....."

"అయినా ఇప్పుడు నా అభీష్టం ప్రకారం ఏమిజరగట్లేదని నువ్విలా దాడి చేస్తున్నావు?" రామలింగం గాడి వాక్ప్రవాహాన్ని ఆపడానికి అన్నాను కానీ, నా గొంతులో కాంఫిడెన్సులేదని నాకే తెలిసిపొతోంది.

అంతే, నామాట వినగానే వాడు ఆవేశంతో ఊగిపోయాడు, "అవునవును,అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతోంది. చాలాతెలివిగా మీఆవిడ ఇష్టాన్ని నీఇష్టంగా చేసుకున్నావు కాబట్టి, అంతా నీఇష్టప్రకారమే జరుగుతోందని సర్దిచెప్పుకుంటున్నావు. నువ్వు చివరిసారిగా మీఆవిడపై నెగ్గిన సందర్భమేదో ఒక్కసారి గుర్తుచేసుకో. నేను చెప్పనా, మీ పెళ్ళితరువాత, బిందెలో ఉంగరమేసి మీఇద్దరిచేత వెతికించినప్పుడు నువ్వుగెలిచావు. అదే చివరిసారి, ఏవిషయంలోనైనా ఆవిడతో నెగ్గడం... Marriage is a relationship in which one person is always right and the other is a husband అన్నకొటేషను ఎంతకరెక్టో నువ్వు నిరూపించావు”, కోపంతో వాడు బీరుబాటిలుమొత్తం లాగించేసాడు.

"అయితే ఇప్పుడునన్నేమి చెయామంటావ్?", వాణ్ణి అర్జెంటుగా శాంతపరచకపోతే,నన్నుకూడ నంజుకుతినేసేటట్లున్నాడు.

నా మాటతో కాస్త స్తిమితపడ్డట్లున్నాడు, ఇంకో బీరుబాటిలు ఓపెన్ చేస్తూ,"నేను చెప్పినట్లు చేసే ధైర్యముందా? మాటమీద నిలబడగలవా?"

"నువ్వలా మాటిమాటికీ దెప్పక్కర్లేదు. ఏమిచెయ్యాలో చెప్పు?" కాస్త కోపం నటించాను.

“Start asserting yourself. నీ ఇష్టాఇష్టాలను పూర్తిగా వదిలేయకు. నీకోసం, అంటే నాకోసం కాస్త టైము కేటాయించు. పూర్తిగా సరెండర్ అయిపోకు. నీ మార్నింగ్ వాక్ విషయమే చూడు. మీ ఆవిడ ఎలా నీ మెడలువంచిందో? ఇంకా..."

"మార్నింగ్ వాక్ నా ఆరోగ్యంకోసమే కదా...తను చేసిందాంట్లో తప్పేముంది?", పాయింటు దొరకగానే నేను అడ్డుతగిలాను.

"మరైతే, కనీసం పార్టీల్లోకుడా మందుపుచ్చుకోవద్దని ఎందుకుకట్టడి చేసింది. ఒక్కసారి పెళ్ళికిముందురోజులు గుర్తుచేసుకో...ఎంత సంతోషంగా గడచిపోయాయి.." గతం గుర్తుకురాగానే ప్రేమాభిషేకం చివరిసీన్లో, చనిపోయే ముందు నాగేశ్వర్రావు చూసినట్లు, జాలిగా అనంతంలోకి చూస్తూ నాస్టాలజెటిగ్గా మారిపోయాడు

"చూడు రామలింగం, పెళ్ళి తరువాత మార్పు అనేది సహజం. దాన్ని అంగీకరించి తీరాలి... సంసారమన్నాక కాస్త సర్దుకుపోకతప్పదు.." మా టీవీలో మంతెన సత్యనారాయణ రాజులా, మంద్రమైన గొంతుతో హితబోధచెయ్యబోయాను..

"ఎన్నైనా చెప్పు, నువ్విలా సరెండరైపోవడం నాకేమాత్రమూ నచ్చలేదు. నువ్వు మారాలి..." అని గంయ్ మన్నాడు రామలింగం.

వీడికెలా సర్దిచెప్పాలా అని సతమతమౌతుంటే, నేను బీరుకొడుతున్న విషయం టెలీపతీ ద్వారా తెలుసుకున్న మా ఆవిడమళ్ళీ ఫోన్ చెసింది. అన్నీ మర్చిపోయి మా ఆవిడతో మాట్లాడుతున్న నన్ను చూసి, "థూ...నీయవ్వ, నిన్ను మార్చడం ఆ జేజమ్మతరం కూడా కాదు..." అంటు, మిగిలిన బీరు లాగించేసి, నా లోనికి దూరి రామలింగం మాయమైపోయాడు.

(అంకితం - మా ఆవిడకి! )